అమరావతి : దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రదేశంగా గండికోటను తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గండికోటలో నిర్వహించిన ‘గండికోట ఉత్సవ్-2026’లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి సవిత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి లతో కలిసి హెలికాప్టర్ రైడ్ ద్వారా గండికోట ప్రకృతి అందాలను, చారిత్రక కట్టడాలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ప్రకృతి సోయగాల నిలయమైన గండికోట మన వారసత్వ సంపద అని, అనేక రాజవంశాల చరిత్రకు, మత సామరస్యానికి ఈ ప్రాంతం ప్రతీక అన్నారు. ఈ గొప్ప చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా తమ కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కందుల దుర్గేష్. ఇప్పటికే ఎవరూ ఊహించని రీతిలో అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇదే క్రమంలో తెలుగు ప్రపంచ మహాసభలను కూడా సక్సెస్ చేశామన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల సహాయ సహకారాలతో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని చారిత్రాత్మక ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. 2047 లక్ష్యంగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు.
