కర్నూలు జిల్లా : ఏపీలోని కర్నూలు జిల్లాలో రాజకీయాలు మరింత రాజుకున్నాయి. వైసీపీ యంగ్ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. బైరెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా ఈ కేసు నమోదైంది. ఆ కార్యక్రమంలో ఆయన, మంత్రి ఒక ఫార్మా కంపెనీ నుండి లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపైనా, తన కుటుంబంపైనా తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను, నంద్యాలకు చెందిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై భగ్గుమన్నారు. మంత్రి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు బీఎన్ ఎస్ (భారతీయ న్యాయ సంహిత) లోని సెక్షన్ 356 , ఇతర నిబంధనల కింద బైరెడ్డిపై కేసు నమోదు చేశారు.
కర్నూలులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన, మంత్రి ఒక ఔషధ సంస్థ నుండి రూ. 45 కోట్ల లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భరత్, బైరెడ్డి తన కుటుంబ సభ్యులను కూడా అవమానించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రజా ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతో, అలాగే విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బైరెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆయనపై సివిల్ పరువు నష్టం దావా కూడా దాఖలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
