రాష్ట్ర వ్యాప్తంగా శనగల కొనుగోళ్లు ప్రారంభం

15 రోజుల లోపు రైతులకు నగదు చెల్లింపులు

hellotelugu-Atchaannaidu

అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రైతులకు మేలు చేకూర్చేలా ధాన్యానికి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయం , రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతితో రబి సీజన్ 2025-26 లో పండించిన శనగలను NAFED, NCCFల ద్వారా 94,500 మెట్రిక్ టన్నుల శెనగల కొనుగోళ్లకు ధర మద్దతు పథకం (PSS) అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయని, నేటి నుంచి CM APP ద్వారా అన్ని జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఉన్న DLPCలు కొనుగోళ్లను పర్యవేక్షిస్తాయని, అవసరమైన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసినట్లు పేర్కొన్నారు.

వ్యవసాయం, ఉద్యానవనం, లీగల్ మెట్రాలజీ, మార్కెటింగ్, ఏపీ మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్ తదితర శాఖల సమన్వయంతో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. PACS, FPOలు, స్వయం సహాయక సంఘాలు వంటి విశ్వసనీయ ఉప-ఏజెన్సీలను రంగంలోకి దింపి పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సీజన్‌లో సుమారు 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగిందని, దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు మంత్రి వివరించారు. రైతులు తమ ఉత్పత్తిని సమీప RSKలలో నమోదు చేసుకోవాలని, CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. కొనుగోలు చేసిన శనగలను CWC/SWC గోదాముల్లో నిల్వ చేస్తామని, రైతులకు చెల్లింపులు 15 రోజుల లోపు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

Exit mobile version