అమరావతి : రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తమ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి . మహిళల భద్రత, రక్షణ సాధికారత ధ్యేయంగా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అభయ ప్రత్యేక కార్యక్రమం బుధవారం నక్కపల్లి సమీపంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద గల భారతీ కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వినూత్న కార్యక్రమాన్ని వంగలపూడి అనిత ప్రారంభించారు. మహిళల రక్షణే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటించారు. ‘అభయ’ కార్యక్రమం ద్వారా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ మహిళల రక్షణ కోసం ఒక అద్భుతమైన కవచాన్ని నిర్మించిందని ప్రశంసించారు.
మహిళలు ఏ సమయంలోనైనా భయం లేకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. వేధింపులకు గురవుతున్న, సైబర్ నేరాల బారిన పడుతున్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పథకం కేవలం ఒక కార్యక్రమం కాదు, మహిళల ఆత్మగౌరవానికి , సాధికారతకు ఒక బలమైన పునాది అని అనిత వంగలపూడి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రసంగిస్తూ జిల్లాలో మహిళా సాధికారత, భద్రతను పటిష్టం చేయడానికి ఈ ‘అభయ’ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందని, ఈ అద్భుతమైన చొరవను తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. కేవలం పోలీసుల పరంగానే కాకుండా, జిల్లా యంత్రాంగం తరఫున రెవెన్యూ, పోలీస్, మహిళా-శిశు సంక్షేమ శాఖల (WCD) సమన్వయంతో తామంతా కలిసి పనిచేస్తామని, క్షేత్రస్థాయిలో ప్రతి మహిళకు అత్యంత వేగవంతమైన సేవలు, భద్రత అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

















