అమరావతి : రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగాళాఖాతంలోని వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి అత్యవసరంగా సమీక్ష చేపట్టారు. రాబోయే తుపాను ప్రభావం గురించి రాష్ట్రంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూంల ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా హై అలర్ట్ గా ఉండాలన్నారు వంగలపూడి అనిత.
ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం బాపట్ల – విశాఖ తీరాల మధ్య తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వంగలపూడి అనిత. ప్రమాదకర స్థితిలో ఉన్న హోర్డింగ్స్ వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరప్రాంత ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు.


















