హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్తును రద్దు చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని అంబర్ పేట నియోజకవర్గ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయబోతున్నదని హెచ్చరించారు.కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని ఆనాడే హెచ్చరించామన్నారు. అయినా వినిపించు కోకుండా ఓట్లు వేసి గెలిపించారని, ఇప్పుడు పెను భారం మోపేందుకు సిద్దమైందన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయన్నారు.
కాంగ్రెస్ కరెంటు కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టి, పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తేసే కుట్ర చేస్తున్నదన్నారు.
దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు నిన్న క్యాబినెట్‌లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ (Prepaid) మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో, వ్యవసాయానికి ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయన్నారు. మోటార్లకు మీటర్లు రాకముందే, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసి వేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రల పైన తిరగ బడాలని కోరారు. ఎన్నికల ముందే ప్రజలకు, “భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుంది” అని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్తారని కేసీఆర్ హెచ్చరించారని కేటీఆర్ గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకు రావడం దారుణం అన్నారు.
