హైదరాబాద్ : ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ చర్చనీయాంశంగా మారాడు. తను భారత పర్యటనపై మౌనం వీడాడు. తను వచ్చే డిసెంబర్ నెలలో పర్యటిస్తాడా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మెస్సీ. ఈ మేరకు తన నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఇండియా పర్యటనలో భాగంగా తను డిసెంబర్ 13న కోల్ కతాకు రానున్నట్టు సమాచారం. మెస్సీ తన టూర్ లో భాగంగా దేశంలోని నాలుగు ప్రధాన నగరాలలో పర్యటించనున్నారు. మొదటగా ఈ స్టార్ ప్లేయర్ కోల్ కతా నగరానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటిస్తారు. మెస్సీ గురువారం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025లో పాల్గొనడాన్ని ధృవీకరించారు, దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధానంగా ఇండియాలోని ఫుట్ బాల్ ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదిలా ఉండగా 14 సంవత్సరాల క్రితం తాను చివరిసారిగా ఆడిన ఉత్సాహభరితమైన ఫుట్‌బాల్ దేశంలో తిరిగి కాలు మోపుతుండడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇండియాలో నాకు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. తాను ఇక్కడ గడిపిన సమయం నుండి మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు సామాజిక వేదిక ద్వారా. భారతదేశం ఒక ఉద్వే గభరితమైన ఫుట్‌బాల్ దేశం. ఈ అందమైన ఆట పట్ల నాకు ఉన్న ప్రేమను పంచుకుంటూ కొత్త తరం అభిమానులను కలవడానికి నేను ఎదురు చూస్తున్నానంటూ మెస్సీ అధికారికంగా ప్రకటించాడు. ఇదే సమయంలో డిసెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తన దేశానికి తిరిగి వెళతారు.



















