హైదరాబాద్ : గత కొంత కాలంగా అలరిస్తూ వస్తున్న వినోదాత్మక రియాల్టీ షో బిగ్ బాస్ – 9 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్ లోకి చేరుకోగా ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గ్రాండ్ ఫినాలేలో విజేతగా ప్రకటిస్తారు షో హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్న ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున. తాజా సమాచారం మేరకు ప్రధాన పోటీ తనూజ, కళ్యాణ్ ల మధ్యే ఉండ బోతోందని ప్రచారం జరుగుతోంది. చివరకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీని ఎవరు గెలుచుకుంటారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గురువారం కీలక ప్రకటన చేశారు నిర్వాహకులు. ఈ మేరకు ఈనెల 21న రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని టాక్. ఇదే సమయంలో తను నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వర ప్రసాద్ గారూ మూవీ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేదికగా దీని గురించి ప్రకటించినా లేదా వివరాలు, విశేషాలు వెల్లడించినా అది ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుందని, అందుకే మెగాస్టార్, అనిల్ రావిపూడి ఓకే చెప్పినట్లు టాక్. ఏది ఏమైనా గతంలో కూడా మెగాస్టార్ ఈ కార్యక్రమానికి హాజరవుతూ వచ్చారు. ఇక ఇప్పటికే షో నిర్వాహకులు హౌస్‌లోని ఐదుగురు ఫైనలిస్టుల ప్రయాణాన్ని ప్రసారం చేస్తున్నారు. తనుజ, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజన, కళ్యాణ్ పద్దాల ఇప్పటికీ పోటీలో ఉన్నారు.



















