హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు మానవీయ కోణంలో వైద్య సేవలు రోగులకు అందించాలని సూచించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి ప్రారంభించారు. వైద్యం యాంత్రికం గా ఉండొద్దు అన్నది వైద్యులకు నా సూచన అని పేర్కొన్నారు. ప్రజలకు మానవత్వంతో కూడిన వైద్య సాయం అందించడం ప్రతి వైద్యుడు కర్తవ్యం గా భావించాలని స్పష్టం చేశారు సీఎం. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు అని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నాం అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితం గా లేదా 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తాం అని ప్రకటించారు.
ఆడబిడ్డల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అని తెలిపారు సీఎం. మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందని అన్నారు. 65 లక్షల మంది హెల్త్ డేటా ను తయారు చేస్తున్నాం అని తెలిపారు. వాళ్ళకి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తాం అన్నారు. గత 20 ఏళ్ల ఆరోగ్య శ్రీ డేటా ను విశ్లేషించి హెల్త్ డేటా తయారు చేస్తున్నామని వెల్లడించారు సీఎం. క్యాన్సర్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ నోరి దత్తాత్రేయను సలహా దారుడిగా నియమించాం అని తెలిపారు. ఆరోగ్య శ్రీ, CMRF కోసం 1800 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని తెలిపారు. ప్రైవేట్ రంగం లో ఉన్న డాక్టర్ లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని సూచించారు.
