అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా… అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని చెప్పారు. వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి సరైన అవగాహన లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని మండిపడ్డారు నారా చంద్రబాబు నాయుడు.
పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని మరోసారి స్పష్టం చేశారు సీఎం. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయని అన్నారు . సీట్లు కూడా పెరుతాయని చెప్పారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునే వాళ్లం అన్నారు. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని చెప్పారు. విమర్శలు చేస్తే భయపడేది లేదన్నారు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలని అన్నారు.
