హైదరాబాద్ : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాం అని తెలిపారు. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించ బోతున్నాం అని తెలిపారు సీఎం. నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం అన్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశ పెడుతున్నాం అని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం అని చెప్పారు.
హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునర్ నిర్మాణం, తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మూసీ రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగు పరిచే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
