అమరావతి : రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు . గురువారం జరిగిన శాసన సభ లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఫిషింగ్ హర్బర్ పనులపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఈశ్వర రావు నడుకుడితి, లోకం నాగ మాధవి ప్రశ్నలు వేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులను ప్రభుత్వమే చేపట్టనుందని ప్రకటించారు శాసన సభ సాక్షిగా. ఫిషింగ్ హర్బర్ అభివృద్ధి ప్రతిపాదనకు సంబంధించి సవరించిన పరిపాలన మంజూరుకు సంబంధించి ప్రభుత్వం క్రియాశీలక పరిశీలనలో ఉందన్నారు. గత ప్రభుత్వంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హర్బర్ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించి, 25 % పూర్తి చేయని పనులు రద్దు కావడం జరిగిందన్నారు.
ఫిషింగ్ హర్బర్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాస్కీ కింద రూ. 135 కోట్ల రుణం కోసం ఆర్ధిక శాఖను అభ్యర్ధించడం జరిగిందని చెప్పారు మంత్రి. ఆర్ధిక శాఖకు రూ. 445 కోట్లతో సవరించిన అంచనాలు పంపించినట్లు తెలిపారు. ఆర్ధిక శాఖ అనుమతి వచ్చిన తర్వాత టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభించి, పూర్తి చేస్తామన్నారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ (FLC) టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.
