Mark Zandi : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్య దిశగా సాగుతోందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ స్పష్టంచేశారు.
ప్రస్తుత స్థూల ఆర్థిక గణాంకాలను విశ్లేషిస్తూ జాండీ (Mark Zandi) పేర్కొన్నదేమిటంటే— అమెరికా జీడీపీలో దాదాపు మూడో వంతు ఇప్పటికే క్షీణత దిశగా వెళ్తోందని, మరో మూడో వంతు నిలకడగా కొనసాగుతుండగా, మిగిలిన భాగమే వృద్ధి సాధిస్తున్నదని అన్నారు. వ్యోమింగ్, మోంటానా, మిన్నెసోటా, మిస్సిసిప్పీ, కాన్సాస్, మసాచుసెట్స్ రాష్ట్రాలు మాంద్య ముప్పు ఎదుర్కొంటున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోత కారణంగా వాషింగ్టన్ డీసీ కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని జాండీ పేర్కొన్నారు.
Mark Zandi – ధరల భారంతో వినియోగదారుల ఇబ్బందులు
అమెరికాలో జీవనావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజా ద్రవ్యోల్బణం 0.2 శాతం పెరిగి 2.7 శాతానికి చేరింది. వచ్చే ఏడాదికాలంలో ఇది 4 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని జాండీ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి తగ్గిపోగా, వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-09 సంక్షోభం తర్వాత కనిష్ఠానికి చేరుకుందని ఆయన చెప్పారు.
జీడీపీ క్షీణత సంకేతాలు
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.50 శాతం పడిపోగా, రెండో త్రైమాసికంలో 3.3 శాతం వృద్ధి నమోదైంది. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణిస్తేనే అధికారికంగా మాంద్యంగా పరిగణిస్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితి ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం
ట్రంప్ సుంకాల యుద్ధం ఉద్యోగావకాశాలను కూడా దెబ్బతీస్తోంది. అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో వ్యవసాయేతర నియామకాలు అంచనాల కంటే తక్కువగా 22,000కే పరిమితమయ్యాయి. నిరుద్యోగ రేటు 4.2 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. గత మే, జూన్ నెలల ఉద్యోగ అంచనాలను కూడా తగ్గించారు.
ఆర్థిక ఒత్తిడి కొనసాగితే కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టవలసి వస్తుందని, దాంతో ఉద్యోగ మార్కెట్ మరింత బలహీనపడే అవకాశముందని జాండీ హెచ్చరించారు. అమెరికన్ కార్పొరేట్ సంస్థల లాభాలు కూడా తగ్గిపోవచ్చని, దానివల్ల గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Today Gold Price : నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు
