ఒడిశా : భారత దేశంలో మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నక్సలైట్లు లేకుండా చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్ కౌంటర్ల ను కొనసాగిస్తూ వస్తోంది. గురువారం మావోయిస్టు అగ్ర నేత (కమాండర్ ) గణేష్ ఉయికే ఎన్ కౌంటర్ అయ్యాడు. మరణించిన మావోయిస్టులలో ఒకరిని ఒడిశాలోని నక్సలైట్ సంస్థకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ,అధిపతి అయిన గణేష్ ఉయికేగా గుర్తించారు. రాష్ట్రంలో అత్యంత వాంటెడ్ మావోయిస్టు నాయకులలో తను ఒకడిగా ఉన్నాడు. తన తలపై రూ. 1.1 కోట్ల రివార్డు ఉంది. ఒడిశాలో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశాలో జరిగిన సంయుక్త నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ వింగ్ నుండి అందిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు.
ఈ ఆపరేషన్ లో మొత్తం 23 బృందాలు పాల్గొన్నాయి. 20 స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు, రెండు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బృందాలతో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పాల్గొన్నాయి. కంధమాల్ జిల్లాలోని చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో, గంజాం జిల్లా సరిహద్దు ప్రాంతాలలోని రాంభ అటవీ ప్రాంతంలో మోహరించబడ్డాయి. ఆపరేషన్ సమయంలో, భద్రతా దళాలు మావోయిస్టులతో పలుమార్లు కాల్పులు జరిపాయి. ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించిన తర్వాత నలుగురు మావోయిస్టుల మృత దేహాలు పడి ఉన్నాయి. ఇందులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. భద్రతా సిబ్బంది ఎన్‌కౌంటర్ స్థలం నుండి రెండు రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడానికి ,ఈ ప్రాంతంలో శాంతిని కాపాడటానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలను ఈ ఆపరేషన్ హైలైట్ చేస్తుందని ఒడిశా పోలీసులు పేర్కొన్నారు.
















