హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న నెలవారీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం గత దశాబ్ద కాలంగా సామాజిక, అభివృద్ధి , జాతీయ అంశాలపై ప్రజలతో మమేకమయ్యే ఒక వేదికగా నిలుస్తోందని కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన్ కీ బాత్’ తాజా ఎపిసోడ్‌పై స్పందించారు. దేశంలోని చేనేత కార్మికులకు మద్దతుగా చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, అలాగే నీటి సంరక్షణలో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టే పద్ధతిని (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) అవలంబించాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, గ్రామాలు , స్థానిక ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగుర వేయడం, ‘తిరంగా యాత్ర’లను నిర్వహించడం ద్వారా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని ప్రధాని కోరారని ఆయన పేర్కొన్నారు.
రాబోయే గణేశ చతుర్థి ఉత్సవాల గురించి ప్రస్తావించారు కేంద్ర మంత్రి , పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన పర్యావరణ అనుకూల విగ్రహాలను ఎంచుకోవాలని భక్తులకు ప్రధాని సూచించారని కిషన్ రెడ్డి చెప్పారు. మ అధికారిక బాధ్యతల నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నెలవారీ ‘మన్ కీ బాత్’ ప్రసారం ద్వారా ప్రజలతో మమేకమవుతూ, ప్రజా ప్రయోజనకరమైన అంశాలను ప్రస్తావించడం, వివిధ జాతీయ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ప్రధాని కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో నిరంతరం సంభాషిస్తున్న ప్రధానిని కిషన్ రెడ్డి అభినందించారు , తెలంగాణ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.

















