హైదరాబాద్ : అసాధారణ శారీరక ఇబ్బందితో బాధపడుతున్న ఉద్యోగికి అండగా నిలిస్తే తప్పుడు ప్రచారం చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఆర్టీసీ సంస్థ ఎండీ. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించింది టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGS RTC) లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి సంబంధించి సోషల్ మీడియాలో , కొన్ని మీడియా వర్గాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను తెలుసుకోకుండా ఒక మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించడం సరికాదని స్పష్టం చేసింది.
మెహదీపట్నం డిపోకు చెందిన కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ (E.222273) సుమారు 198 సెంటీమీటర్ల (6 అడుగుల 6 అంగుళాలు) అసాధారణ ఎత్తును కలిగి ఉన్నారు. ఈ శారీరక స్థితి కారణంగా ఆయన బస్సుల్లో కండక్టర్‌గా తన విధులను నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది కాలంగా అన్సారీ ఎదుర్కొంటున్న ఈ శారీరక ఇబ్బందులను గమనించిన సంస్థ, ఆయనపై సానుభూతితో గతంలోనే అవుట్ ఆఫ్ డెసిగ్నేషన్ (OD) విధులను కేటాయించింది. ఆ గడువు ముగియడంతో, సదరు ఉద్యోగి పడుతున్న కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు తన సేవలను బస్ పాస్ సెక్షన్లలో లేదా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ఉన్న సంస్థ కార్యాలయాల్లో వినియోగించు కోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది పూర్తిగా ఉద్యోగి శ్రేయస్సు , సంస్థ అవసరాల దృష్ట్యా తీసుకున్న పరిపాలనా పరమైన నిర్ణయం మాత్రమేనని స్పష్టం చేసింది. సంస్థ తన సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇలాంటి సున్నితమైన అంశాలను తప్పుదోవ పట్టిస్తూ కొన్ని మీడియా సస్థలు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.
