హైదరాబాద్ : ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్దన’లో విలన్ పాత్ర ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రతికూల పాత్ర కోసం మొదట తమిళ నటులు విజయ్ సేతుపతి ఎస్.జె. సూర్యల పేర్లను పరిశీలించినప్పటిక చివరకు మలయాళ నటుడు జోజు జార్జ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ గ్రామీణ నేపథ్యంలో సాగే పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తుండగా కీర్తి సురేష్ కథానాయికగా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు రాజశేఖర్ , సముద్రఖని కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం మొదట ఈ విలన్ పాత్ర కోసం చిత్ర బృందం విజయ్ సేతుపతిని సంప్రదించింది. అయితే ఆయన సుమారు రూ. 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో చర్చలు ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఎస్.జె. సూర్యను సంప్రదించగ ఆయన సుమారు రూ. 15 కోట్లు కోరినట్లు సమాచారం. వారితో చర్చలు ఫలించక పోవడంతో చిత్ర బృందం జోజు జార్జ్ వైపు మొగ్గు చూపింది.మలయాళ నటుడైన జోజు జార్జ్ తన విలక్షణమైన నటనకు పేరు పొందారు. ఆయన ఈ చిత్రంలో భాగమైతే విజయ్ దేవరకొండతో ఆయన చేసే పోరాటం తెరపై కొత్త అనుభూతిని కలిగిస్తుందని భావిస్తున్నారు. కాగా దీనిపై చిత్ర బృందం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ చిత్రంలోని ప్రధాన సంఘర్షణలో విలన్ పాత్ర చాలా కీలకం కానుంది. బలమైన నటనతో కూడిన ఈ పాత్ర, యాక్షన్ డ్రామాకు మరింత లోతును చేకూర్చడమే కాకుండా కథానాయకుడితో ఆసక్తికరమైన పోరాటానికి దారితీస్తుంది. పూర్తి తారాగణం , ఇతర వివరాల కోసం ప్రేక్షకులు అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
