ఈసారి హైబ్రిడ్ మోడ్ లో మహానాడు నిర్వ‌హణ‌

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు

hellotelugu-PallaSrinivaasaRao

అమ‌రావ‌తి : ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా నిర్వహించే మహానాడు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో మ‌హానాడు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే భారీ ఏర్పాట్లు చేసే ప‌నిలో ఉన్నామ‌న్నారు. అయితే సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. జరగబోయే పసుపు పండుగ మహానాడు ఈసారి హైబ్రిడ్ మోడ్ లో జరపాలని పార్టీ నిర్ణయించిందని వెల్ల‌డించారు. పశ్చిమాసియా యుద్ధం, ప్రస్తుతం దేశంలో ఉన్న ‘ఆయిల్ క్రైసిస్’ (చమురు సంక్షోభం) ప్రభావం దృష్ట్యా బాధ్యతగా వ్యవహరించాలని జాతీయ అధ్యక్షులు భావించారని తెలిపారు పల్లా శ్రీనివాస‌రావు.

పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఈ నెల 27, 28 తేదీన హైబ్రిడ్ మోడ్ లో జరిగే మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, స్టేట్ బాడీ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఒక్కో క్లస్టర్ దగ్గర సుమారు 500 మంది కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. మే 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడులు, 23, 24 తేదీల్లోని పార్లమెంట్ స్థాయి మహానాడులను రద్దు చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు ప‌ల్లా శ్రీనివాస రావు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతించాలని కోరుతున్నాం అన్నారు.

Exit mobile version