హైదరాబాద్ : ఈ లోకం ఉన్నంత వరకు , పాట ఉన్నంత వరకు ఎస్పీ బాలసుబ్రమణ్యం బతికే ఉంటారని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. అశేష ప్రజానీకపు విశేష అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ గాయకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, వారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖను అభినందిస్తున్నానని అన్నారు.
శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం కేవలం స్వర సార్వభౌముడు మాత్రమే కాదు, ఆయన సంస్కారవంతుడు, నిరాడంబరుడు అని ప్రశంసలు కురిపించారు వెంకయ్య నాయుడు. ఆయన గాత్రంలో నవరసాలు నాట్యం చేసేవని అన్నారు. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, మార్గదర్శిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారని కొనియాడారు. ఆయన ఆలపించిన ప్రతి పాటా, ప్రతీ రాగం ఒక భావ జలపాతం అన్నారు. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవని గుర్తు చేశారు . ఎంతో మంది నటుల నటనా శైలికి, హావ భావాలకు, గాత్రధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం అన్నారు. ఎస్పీబీ గళం… సంగీత దర్శకుడు ,గేయ రచయిత ఏది కోరుకుంటే అది పలికించే ఒక అక్షయపాత్ర అని ప్రశంసించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
బాల సుబ్రమణ్యం లో ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడున్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమాల్లో చిన్నారులను ఆయన ప్రోత్సహించిన తీరు, వారికి జీవిత సత్యాలను బోధించే తీరు అద్భుతం అని పేర్కొన్నారు. పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు వారు ప్రయత్నించారని గుర్తు చేశారు. చిన్నారులకు ఆయన చూపిన మార్గదర్శనం, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం నేటి తరానికి ఆదర్శం అన్నారు. మన భాషా సంస్కృతులను పరిరక్షించు కోవడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
















