బంగాళాఖాతంలో అల్ప పీడ‌నం జ‌ర భ‌ద్రం

ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రిక

hellotelugu-APIMD

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ రాష్ట్ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు ప్ర‌ఖ‌ర్ జైన్. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడ రాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు రైతులు, పశువుల‌ కాపరులు చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు సంబంధించిన వాతావ‌ర‌ణ సూచ‌న‌ల‌ను , ప్ర‌స్తుత ప‌రిస్థితిని రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలియ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ప‌రిస్థితిపై ఆరా తీశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వెంట‌నే అప్ర‌మ‌త్తం కావాల‌ని ఆదేశించారు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను. సంబంధిత మంత్రులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌న్నారు.

Exit mobile version