అశ్వ వాహనంపై కల్కి అవతార వైభవం

భక్తులను అనుగ్రహించిన గోవింద రాజస్వామి

hellotelugu-AshwaVahanam

తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి అశ్వవా హన సేవ అత్యంత వైభవంగా జరిగింది .ఈ సందర్భంగా శ్రీ గోవింద రాజ స్వామి వారు కల్కి అవతార అలంకారంలో అశ్వ వాహనంపై విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్త బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నాదాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి వాహనసేవ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పరవశించి పోయారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తాయి. అశ్వ వాహనంపై కల్కి స్వరూపంలో దర్శనమిచ్చిన స్వామివారు, కలియుగ దోషాలకు దూరంగా ఉండి భగవన్నామ సంకీర్తన, ధర్మాచరణలను ఆశ్రయించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సందేశమిచ్చారు. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈఓ ఏ.బీ.నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయులు, అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Exit mobile version