తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజస్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అభయానుగ్రహాలు ప్రసాదించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో గోవింద నామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, వేద ఘోషల నడుమ తిరుపతి మాడవీధులు భక్తి రసంతో పరవశించాయి. నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ భిన్న అలంకారాలలో భక్తులను అలరిస్తుంటాడు. ముత్యపు పందిరిపై వెలసిన స్వామివారి దివ్య మంగళ విగ్రహం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రతీకగా భావించే ముత్యం చల్లదనానికి, శాంతికి సంకేతం. సముద్ర గర్భం ప్రసాదించిన అమూల్య రత్నాలైన ముత్యాల కాంతుల మధ్య నిలిచిన శ్రీహరి దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి, జీవితాల్లో ప్రశాంతతను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనే విశ్వాసం భక్తుల్లో వెల్లి విరిసింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శేషగిరి, చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


















