అమరావతి : ఏపీ చేనేతకు, ప్రత్యేకించి మంగళగిరి చేనేత వస్త్రాలకు మంత్రి నారా లోకేష్ దంపతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని అన్నారు మంత్రి ఎస్. సవిత. లోకేష్, బ్రాహ్మాణిలు ఏ శుభకార్యానికి వెళ్లినా చేనేత వస్త్రాలనే బహుకరిస్తున్నారని పేర్కొన్నారు.. ఇక బ్రహ్మాణి వివిధ సందర్భాల్లో మంగళగిరి చేనేత వస్త్రాలు ధరిస్తూ ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. మరోవైపు లోకేష్ తాను కలిసే ప్రతినిధులకు… తనను కలవడానికి వచ్చే వారికి చేనేత శాలువాతో సత్కరిస్తున్నారని చెప్పారు.. చేనేత వస్త్రాలను బహుకరిస్తున్నారని , ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ చేనేత వస్త్రాలతో ఆయన్ను సత్కరిస్తారని పేర్కొన్నారు. తాజాగా ప్రజా ప్రతినిధుల కుటుంబాలకు ఇచ్చిన ఆత్మీయ విందులోనూ మంగళగిరి చీరలను నారా లోకేష్ బహుకరించారు.
ఇక మంగళగిరిలో నేతన్నల కోసం వీవర్ శాల ఏర్పాటు చేశారన్నారు ఎస్. సవిత. ఈ వీవర్ శాలలో చేనేత రంగానికి నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక టూల్స్ అందుబాటులోకి తెచ్చి… చేనేత రంగాన్ని ప్రొత్సహిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆప్కో షో రూమ్ ల బలోపేతానికి చర్యలు తీసుకుందని చెప్పారు సవిత. అమ్మకాలు పెంచేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందజేసిందన్నారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ, డిజిటల్ అమ్మకాలు ప్రారంభించిందని తెలిపారు. చీరలు, దుప్పట్లు, తువ్వాళ్లతో పాటు చేనేత రెడీమేడ్ దుస్తులను అమ్మకానికి పెట్టారన్నారు. పుట్టపర్తి, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, టెక్కలి, అనకాపల్లిలో అయిదు కొత్త షోరూమ్‌లు ప్రారంభించిందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రెండేళ్లలో రూ.188.01 కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. చేనేత సహకార సంఘాలకు విడతల వారీగా ఆప్కో బకాయిలు చెల్లిస్తూ వస్తోందన్నారు.
















