త‌మిళ‌నాడులో లా అండ్ ఆర్డ‌ర్ ఫెయిల్

నిప్పులు చెరిగిన డీఎంకే ఎంపీ క‌నిమొళి

hellotelugu-MPKanimozhi

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు డీఎంకే ఎంపీ క‌నిమొళి. రాష్ట్రంలో రోజు రోజుకు లా అండ్ ఆర్డ‌ర్ క్షీణిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను నియంత్రించ‌డంలో సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ వైఫ‌ల్యం చెందార‌ని పేర్కొన్నారు. తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ సమీపంలో తాగునీటి సరఫరాలో అంతరాయంపై జరిగిన నిరసనల ఇటుక దెబ్బ తగిలి 68 ఏళ్ల పంచాయతీ అధ్యక్షుడు మరణించిన ఘటన క‌ల‌క‌లం రేపింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, తూత్తుకుడి ఎంపీ క‌నిమొళి కరుణానిధి ఆరోపించారు. వల్లియూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని కన్ననల్లూర్ పంచాయతీ అధ్యక్షుడు మహారాజన్ తామరైకుళం గ్రామంలో తాగునీటి సరఫరా సమస్యపై నిరసన తెలుపుతున్న స్థానికులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తుండగా, నిరసనకారులలో ఒకరు ఆయనపై ఇటుక విసిరారు. ఆ ఇటుక మహారాజన్ తలకు బలంగా తగలడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు.

నిరసనకారులు ఆయన్ని నంగునేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తాగునీటి సమస్యపై స్థానికులతో చర్చిస్తుండగా ప్రజాప్రతినిధి ఒకరు హత్యకు గురి కావడం దిగ్భ్రాంతికరమని ఎంపీ పేర్కొన్నారు, అలాగే దాడి చేసిన వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడానికి ఈ సంఘటన అద్దం పడుతోందని పిల్లలు, మహిళలు , ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో సురక్షితంగా లేరని ఆమె విమర్శించారు. మహారాజన్ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క‌నిమొళి డిమాండ్ చేశారు.

Exit mobile version