హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు, రేవంత్ రెడ్డి చేస్తున్న బినామీ వ్యాపారాల పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు సుదీర్ఘమైన లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులో విచారణ సందర్భంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని ఆరోపించారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కోసమే అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను, పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదన్నారు కేటీఆర్.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. KLSR కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ సంస్థపై ఉన్న విచారణను అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కంపెనీ పైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసుల పైన పక్షపాతం లేకుండా, ఒత్తిడి లేకుండా నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని కోరారు. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2,500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించడం దారుణమన్నార. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయన్నారు.
సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణ పనులను అడ్డగోలుగా రేవంత్ రెడ్డి దివాలా తీసిన ఈ కంపెనీకి అప్పచెబుతున్నారని ఆరోపించారు. ఆ కంపెనీకి, రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు అన్నారు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. కంపెనీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించిందని గుర్తు చేశారు కేటీఆర్.
