హైదరాబాద్ : రాష్ట్ర ఖనిజావృద్ది సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న వేళ, సొంత పార్టీ నేతలపైనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం అని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత పీసీసీ (PCC) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని కించ పరచడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రస్తుత నాయకత్వాన్ని అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. జగ్గారెడ్డికి పీసీసీ పదవి ఇస్తేనే 100 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడటం అంటే.. ప్రస్తుతం పదవిలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ని, ఆయన నాయకత్వాన్ని పూర్తిగా తక్కువ చేసి చూపడమేనని పేర్కొన్నారు.
సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక బీసీ నేతను పక్కన పెట్టి, మరొకరికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం ద్వారా మీరు పార్టీలో చీలికలు తేవాలని చూస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ అద్భుత పాలనలో, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో పార్టీ తిరుగులేని విజయాలను నమోదు చేస్తోందని అన్నారు అనిల్ కుమార్. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి నిన్నటి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల వరకు కాంగ్రెస్ జెండా రెపరెపలాడిందన్నారు. ఈ విషయం మరిచి పోయి కోమటిరెడ్డి మాట్లాడటం భావ్యం కాదన్నారు.
