అమరావతి : ఏపీ ఛాంబర్స్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసింది. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించి కీలక ప్రతిపాదనలు సమర్పించింది. సమర్పించిన ప్రధాన ప్రతిపాదనలు పరిశీలిస్తే.. పరిశ్రమలు, హాస్పిటాలిటీ, ట్రావెల్, ఏవియేషన్, లాజిస్టిక్స్ రంగాలు , ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులతో టూరిజం స్టాక్‌హోల్డర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేస్తూ, అంతర్జాతీయ రోడ్‌షోల ద్వారా ‘విజిట్ ఏపీ’ ప్రచారాన్ని గ్లోబల్‌గా ప్రమోట్ చేయాలని కోరారు ఏపీ చాంభర్స్ ప్రతినిధుల బృందం. రూ.50 కోట్ల లోపు వ్యయంతో కూడిన ఎంఎస్ఎంఈ పర్యాటక ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా ఫాస్ట్ ట్రాక్ విధానం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
హోమ్ స్టేల విషయంలో భద్రతా ప్రమాణాలతో కూడిన సింగిల్-విండో రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెచ్చి, వాటిని పర్యాటక శాఖ అధికారిక పోర్టల్ ద్వారా ప్రమోట్ చేయాలన్నారు. ప్రైవేట్ భూముల్లో కొత్త సంస్థలు ప్రతిపాదించే ప్రాజెక్టులను పరిశీలించేటప్పుడు, ప్రమోటర్ల ఆర్థిక బలం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.విజయవాడ – అమరావతి – సూర్యలంక – పాండురంగాపురం – ఓడరేవు – చీరాల బీచ్ కారిడార్, విశాఖపట్నం – అరకు లోయ సర్క్యూట్, గండికోట – బెలూమ్ గుహలు – యాగంటి తదితర పర్యాటక సర్క్యూట్‌ల అభివృద్ధి, లేపాక్షి, గండికోట, బెలూమ్ గుహలకు యునెస్కో గుర్తింపుకు చర్యలు తీసుకోవాలని కోరారు. .ప్రధాన పర్యాటక ప్రాంతాలలో స్థానిక ప్రజలు, అధికారులు, ఆపరేటర్ల భాగస్వామ్యంతో డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కమిటీలు వేయాలని, ప్రత్యేక యాత్రా సర్క్యూట్‌ల కోసం రైల్వేలు, ఎయిర్‌లైన్స్, క్రూజ్ ఆపరేటర్లతో చర్చించాలని మంత్రి దుర్గేష్ కోరారు.
ఏపీ ఛాంబర్స్ చేసిన ప్రతిపాదనలపై మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. పెండింగ్‌లో ఉన్న పర్యాటక ప్రతిపాదనల క్లియరెన్స్‌ను వేగవంతం చేస్తామని, పర్యాటక ప్యాకేజీల ప్రమోషన్ కోసం ఏపీ ఛాంబర్స్ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్ రావు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి. స్వామి, రాష్ట్ర టూరిజం మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు మరియు సలహాదారు లక్ష్మీనారాయణ, జీఆర్టీ హోటల్స్ జీఎం హరిప్రసాద్, సేల్స్ మేనేజర్ శ్రీకాంత్, హిరణ్య జర్నీస్ ప్రతినిధి కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
