కేతిరెడ్డి ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ ప్రారంభం

సంచ‌ల‌నంగా మారిన మాజీ ఎమ్మెల్యే ప్రోగ్రాం

hellotelugu-KethireddyGodMorning

అనంత‌పురం జిల్లా : వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న గుడ్ మార్నింగ్ ధ‌ర్మవ‌రం పేరుతో వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందారు. ఉదయాన్నే ఆయా గ్రామాల‌లో ప‌ర్య‌టించ‌డం, అక్క‌డిక‌క్క‌డే ప్ర‌జ‌లతో ముచ్చ‌టించ‌డం, వారి స‌మ‌స్య‌ల‌ను స్పాట్ లోనే ప‌రిష్క‌రించ‌డం చేశారు. కానీ కూట‌మి ప్ర‌భంజ‌నం కార‌ణంగా రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కేతిరెడ్డి వెంక‌ట్రామి రెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన బీసీ నేత స‌త్య కుమార్ యాద‌వ్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఇక ఇక్క‌డ విజ‌యం సాధించిన యాద‌వ్ కు ఊహించ‌ని రీతిలో బీజేపీ హై క‌మాండ్ కీల‌క‌మైన కేబినెట్ మంత్రి హోదాను క‌ల్పించింది.

ఈ త‌రుణంలో మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించేందుకు రంగంలోకి దిగారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. 20 నెలలు సమయం ఇచ్చామ‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఘోరంగా విఫ‌లం చెందార‌ని ఆరోపించారు. గుడ్ మార్నింగ్ లో భాగంగా ఏవో భూములు ఆక్రమించానంటూ ఆరోప‌ణ‌లు త‌న‌పై చేశార‌ని అన్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న వారు తాను ఒక్క సెంటు భూమి కూడా ఆక్ర‌మించిన‌ట్లు ఆధారాలు చూపించ లేక పోయార‌ని ఎద్దేవా చేశారు. క‌నుక‌నే మ‌రోసారి గుడ్ మార్నింగ్ ధ‌ర్మవ‌రం కార్య‌క్ర‌మానికి తిరిగి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి.

Exit mobile version