వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. తన పదేళ్ల పదవీ కాలంలో తెలంగాణను దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ పేరు చెప్పి ఆనాడు జగన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా కేసీఆర్ కుట్రకు తెర లేపాడని ఆరోపించారు. కేసీఆర్ స్వరాష్ట్రం కోసం కాకుండా పక్క రాష్ట్రం బలడేందుకు కృషి చేశాడని అన్నారు. గోదావరి జలాలను తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇచ్చిన మొనగాడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు సీఎం. 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్లు అప్పగించి చూసిన కేసీఆర్ 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు ఇస్తే 30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగు నీరు వచ్చి ఉండేది కాదా అని నిలదీశారు.
గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్య శ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణతో పాటు పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలను చేపడుతామని వెల్లడించారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
















