తిరుమ‌ల‌లో కారీరిష్టి, వ‌రుణ యాగం : టీటీడీ

నేటి నుండి సెప్టెంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు

hellotelugu-TTDHomam

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆగ‌స్టు 30 ఆదివారం నుండి సెప్టెంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ వరుణయాగ, పర్జన్యశాంతి సహిత కారీరిష్టి యాగాలను టీటీడీ నిర్వహించనుంది.

తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.. 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఇందు కోసం ఏర్పాట్లు విస్తృతంగా చేప‌ట్టారు. ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్‌ వరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3వ తేది వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వరుణ యాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి కార్యక్రమాలతో పాటు ఏడు వేదశాఖల పారాయణం, రామాయణం, సుందరకాండ, విరాటపర్వం, ఋష్యశృంగ ధ్యాన పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోగర్భం డ్యామ్‌ వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానం నిర్వహిస్తారు. సాయంత్రం 6గం.నుండి రా. 8.గం వరకు ధర్మగిరిలో అగ్నిహోత్ర అనుష్ఠానం, ఏడు వేదశాఖల పారాయణం జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Exit mobile version