ఘ‌నంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధారణ

మహా సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభం

hellotelugu-TTD

దేవుని కడప : దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమశాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. జీర్ణోద్ధారణ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన మహాసంప్రోక్షణ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయానికి పూర్వ వైభవం, పవిత్రత మరింతగా చేకూరాలని ప్రార్థించారు. మహాసంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం పునః ప్రారంభమైంది. అంతకు ముందు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈవోకు అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ విశిష్టత, చారిత్రక , ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో ఎ. ప్రశాంతి, ఏఈవో రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version