హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోందని చెప్పారు. శనివారం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో. ట్యాంక్ బండ్ మీద పూలే విగ్రహం ఏర్పాటు చేయటం పాక్షిక విజయమేనని అన్నారు. అయితే తమ ప్రధాన డిమాండ్ ఒక్కటేనని, పూలే విగ్రహం అసెంబ్లీలో కూడా ఉండాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి కాదన్నారు కల్వకుంట్ల కవిత.
ఇదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ ను ఏకిపారేశారు. వాళ్లు పెట్టే కాంగ్రెస్ బొమ్మకు ప్రజల ఆమోదం లభించదని అన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు కవిత. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి, సర్కార్ కు. అధికారం ఉందని వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. పూలే విగ్రహాన్ని శాసన సభ ఆవరణలో ఏర్పాటు చేసేంత వరకు తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత.
