హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కరెంట్ మీటర్ రీడింగ్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. గత అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సంక్షేమ సౌకర్యాలు పూర్తిగా అమలు కాకపోవడం, పనిభారం అధికంగా ఉండటం వంటి సమస్యలను దృష్టికి తీసుకు వచ్చారు. కార్మికులు మాట్లాడుతూ తాము 10–15 సంవత్సరాలుగా పని చేస్తున్నప్పటికీ స్థిరీకరణ జరగలేదని వాపోయారు. నెలకు కేవలం రూ.4,000 నుంచి రూ. 7,000 మధ్య మాత్రమే వేతనం అందుతుందని, అదీ సమయానికి చెల్లించక పోవడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదనంగా అనవసరమైన కాల్స్, టార్గెట్లు, ఒత్తిళ్లు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. చాలా మంది కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు సక్రమంగా జరగడం లేదని కూడా వినతిపత్రంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం , సంబంధిత విభాగాలతో మాట్లాడి రెండు నెలల లోపు స్పష్టమైన పరిష్కారం వచ్చేలా చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ-ఈపీఎఫ్ వంటి హక్కులు తప్పనిసరిగా అందాలని ఆయన స్పష్టం చేశారు.
