అమరావతి : మాజీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్ సత్తా చీఫ్ జయప్రకాష్ నారాయణ, ఏబీఎన్ చీఫ్ రాధాకృష్ణలపై. ఈ వర్గం అంతా పేదల వ్యతిరేకులు. పెట్టుబడి దారులు, దోపిడీ ముఠా . ముఖ్యంగా దళితులు బీసీ లు కనీస వేతనాలు కానీ , హక్కులు కానీ అడగకుండా బానిసల్లా అణిగి మణిగి పడి ఉండాలనేది వీళ్ళ ప్రవచనాల సారాంశం తప్ప మరోటి కాదన్నారు. రెండు చేతులా పెన్షన్లు గుంజుతూ.. బక్కజీవుల భరోసాపై ఉపన్యాసాలా? అని మండిపడ్డారు. లోక్‌సత్తా జేపీ ఆర్థిక నీతుల వెనుక దాగిన ‘నైతిక దివాలాకోరుతనం’ మేధావితనం అంటే ఎల్లప్పుడూ సమస్య మూలాలను శోధించడం అనుకుంటే పొరపాటే అవుతుంది. అది కొన్నిసార్లు పాలకవర్గాల కార్పొరేట్ దోపిడీని కప్పి పుచ్చేందుకు అల్లిన ఒక అందమైన సిద్ధాంత జాలం కూడా అవుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులపై, పాత పెన్షన్ విధానంపై లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు అచ్చంగా ఆ నయా ఉదారవాద అంకెల గారడీకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆయన విశ్లేషణల్లో పైకి కనిపించే ఆర్థిక క్రమశిక్షణ” వెనుక, అత్యంత ప్రమాదకరమైన విభజించి పాలించే కుతంత్రం దాగి ఉంది.
ఈ నయా ఉదారవాద విశ్లేషకులు ఎప్పుడూ సమాజంలో అసమానతలను సృష్టించి ఆటలాడుతుంటారు. ఆటో డ్రైవర్‌కు లేని పెన్షన్ ఉద్యోగులకు మాత్రం ఎందుకు? అనే తప్పుడు పోలికల్ని సృష్టించి, పేదలపై ఉద్యోగులను, ఉద్యోగులపై పేదలను ఉసిగొల్పడం వీరి రాజకీయ ఎత్తుగడ. కూలీలకు, ఆటో కార్మికులకు, రైతులకు మొదలైన అసంఘటిత వర్గాలకు. పింఛన్లు, కనీస భద్రత లేక పోవడానికి కారణం బడిపంతుల్లో ప్రభుత్వ ఉద్యోగులో కాదు గదా. దేశ సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న కార్పొరేట్ దళారులు, వారి పన్నులను మాఫీ చేస్తున్న పాలకులే కదా . దేశ పౌరులందరికీ విశ్వజనీనమైన సాంఘిక భద్రత కావాలని పోరాడాల్సిన ఒక మాజీ బ్యూరోక్రాట్. ఉన్న ఉద్యోగి భద్రతను కూడా ఊడబీకి అందరినీ అభద్రతలోకి నెట్టాలనడం సంస్కరణ కాదు, సంక్షేమ విధ్వంసమే అవుతుంది . నీతులు చెప్పే గొంతు ఎంత గంభీరంగా ఉందన్నది కాదు ముఖ్యం. ఆ గొంతు వెనుక ఎంత నిజాయితీ ఉందన్నదే అసలు ప్రశ్న.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పదవీ విరమణ తర్వాత ఆత్మ గౌరవంతో బతకడానికి పాత పెన్షన్ (OPS) అడిగితే అది రాష్ట్రాన్ని దివాళా తీయిస్తుంది, “ఖజానాకు గుదిబండ” అంటూ రోజుకో ప్రవచనం వల్లించే లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ మేధావితనం వెనుక ఉన్న అత్యంత హాస్యాస్పదమైన, వికృతమైన సత్యం ఏమిటంటే. ప్రజలంతా సమానం కానీ, మేం మాత్రం కాస్త ఎక్కువ సమానం అన్నట్లుగా ఈ కుహనా మేధావి స్వయంగా ఒకేసారి రెండు పెన్షన్లను తీసుకుంటూ నిస్సిగ్గుగా సకల రాయితీలను అనుభవిస్తూనే, మరోవైపు సామాన్య ఉద్యోగికి దక్కాల్సిన కనీస రక్షణను రద్దు చేయమనడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు పరాకాష్ట కాదా? . 30-35 ఏళ్లపాటు పల్లెల్లో పిల్లలకు చదువులు చెప్పి, ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చి అలసి పోయిన ఒక ఉపాధ్యాయుడికి, ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత “ఒక్క పెన్షన్” ఇవ్వడానికే ఖజానా మునిగి పోతోందని గగ్గోలు పెట్టడానికి ఎంతటి నైతిక దివాలా కోరుతనం కావాలి? తన రెండు పెన్షన్లను వదులుకొని ఆతర్వాత ఉద్యోగులకు హితబోధ చేస్తే బాగుంటుంది కానీ ఆ దమ్ము జేపీకి ఉందా?
ప్రభుత్వ ఉద్యోగులకు దక్కే అరకొర సౌకర్యాలను సామాన్యులతో పోల్చి సామాజిక విభజనలను సృష్టించే తనకు ప్రభుత్వాలు, పాలకుల దుబారాలు కనిపించవెందుకో? . వాళ్ళు పొందే అలవెన్సుల మీద పన్ను ఎందుకు ఉండదో ఏనాడైనా ప్రశ్నించే సాహసం చేయరెందుకు? లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి బడా కార్పొరేట్లు దర్జాగా తిరుగుతుంటే, బ్యాంకులు వాటిని ‘రైటాఫ్’ల పేరిట మాఫీ చేస్తుంటే వాటి పైన వ్యాసాలు రాయరెందుకు? పేదవాడు కొనే సబ్బు నుంచి ఉప్పు దాకా ప్రతి వస్తువు మీద బాదుతున్న జీఎస్టీ దోపిడీ ఎందుకు కనిపించదు? విద్యా, ఉపాధి అవకాశాలు లేక రోడ్లపైకి వస్తున్న నిరుద్యోగ యువత ఆర్తనాదాలు ఎందుకు వినిపించవు? . ఐదేళ్లు పదవిలో ఉండి ప్రజాధనంతో కార్లు, బంగళాలు, జీవితాంతం పెన్షన్లు అనుభవిస్తూ ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కట్టని ప్రజాప్రతినిధుల రాయితీలపై ఏనాడైనా జేపీ ఇంత తీవ్రంగా స్పందించారా?
కార్పొరేట్లకు బ్యాంకు రుణాల రద్దుల రూపంలో దారపోస్తున్న ప్రజాధనం కనిపించదు కానీ 35 ఏళ్లపాటు తమ శ్రమను శక్తిని వ్యవస్థకు ధారపోసిన ఉద్యోగికి నెలకు దక్కే అరకొర పెన్షన్ మాత్రమే ఖజానాకు తూట్లు పొడుస్తున్నట్లు కనిపించడం అసలైన వర్గ పక్షపాతం కాదా? రూపాయి విలువ రోజురోజుకు పతనమై, పెట్రోల్-డీజిల్ ధరలు భగ్గుమంటూ, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు ఇచ్చే పీఆర్సీ (PRC), కరువు భత్యాలు (DA) ఉద్యోగుల హక్కులే తప్ప పాలకుల భిక్ష కాదు. పౌరులందరికీ గౌరవ ప్రదమైన జీవనం బతికించు కోవడానికి జరుగుతున్న యుద్ధం. పాలకులు రాసిచ్చిన స్క్రిప్టును ఆర్థిక శాస్త్రంగా వల్లెవేసే విశ్లేషకులు ఈ నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది .


















