అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుల జాతరతో సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని, చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసి చూపించడమే తమ ప్రభుత్వ మార్క్ పరిపాలన అని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఎం. సుగుణమ్మ స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, విలువలతో కూడిన విద్యను అందిస్తూ, నిరుద్యోగ యువతకు న్యాయ బద్ధమైన డీఎస్సీ నియామకాల ద్వారా వేలాది ఉపాధ్యాయ కొలువులు కల్పించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తెలిపారు.
ఇటువంటి అద్భుతమైన ప్రజాపాలనపై జగన్మోహన్ రెడ్డి కడుపుమంటతో, నిరాశతో అవాకులు చవాకులు పేలుతున్నారని సుగుణమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలను చూసి ఓర్వలేక ఆయన చేస్తున్న యాగీని, రాద్ధాంతాన్ని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. గతంలో పింక్ డైమండ్ వంటి ఎన్నో పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్, ఐదేళ్ల పాలనలో యువతను ఘోరంగా వంచించి దగాకోరు నాయకుడిగా మిగిలి పోయారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పినప్పటికీ జగన్కు ఇంకా బుద్ధి రాలేదని, ఆయన అబద్ధపు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు ఎవరూ లేరని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అంటేనే ఉద్యోగాల కల్పవల్లి అని, ఐదేళ్లుగా నిరుద్యోగులు పడిన నిరీక్షణకు తెరదించుతూ కేవలం 156 రోజుల రికార్డు వ్యవధిలోనే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులను భర్తీ చేసి రికార్డు సృష్టించామని ఆమె పేర్కొన్నారు. మెగా డీఎస్సీ పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రెండో డీఎస్సీ నోటిఫికేషన్ను సైతం విడుదల చేశామన్నారు. ఇందులో సాధారణ పాఠశాలల్లో 2,111 పోస్టులు, దివ్యాంగ విద్యార్థుల కోసం 350 ప్రత్యేక పోస్టులు, గురుకులాల్లో 260 పోస్టులు, రెసిడెన్షియల్ సంస్థల్లో 68 పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 15 పోస్టులను పారదర్శకంగా కేటాయించినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు నియామకాల్లో పెద్దపీట వేయడమే కాకుండా, కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను పునరుద్ధరించి వారి కుటుంబాలను ఆదుకున్నామన్నారు. ఉపాధ్యాయులపై అనవసర యాప్ల భారం తొలగించి, సాల్ట్ కార్యక్రమం ద్వారా వారికి అంతర్జాతీయ స్థాయి వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
1994 నుంచి 2025 వరకు మొత్తం 14 డీఎస్సీలను విజయవంతంగా నిర్వహించి 1,96,619 మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయ కొలువులు కల్పించిన ఏకైక ఘనత చంద్రబాబు నాయుడు దేనని సుగుణమ్మ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల చేత మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టించారని, మరుగుదొడ్లు కడిగించారని, రకరకాల యాప్లు, నాడు-నేడు ఫోటోల పేరిట తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని మండిపడ్డారు.
