హైదరాబాద్ : తన 26వ పుట్టినరోజు సందర్భంగా నటి కృతి శెట్టికి ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ లభించింది. ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ఆమె ఫస్ట్-లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. అనిల్ రావిపూడి ,వెంకటేష్ కలయికలో రాబోతున్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సంక్రాంతి 2027 ఎంటర్‌టైనర్ చిత్రంలో ఆమె సరికొత్త సాంప్రదాయక రూపంలో కనిపిస్తోంది. టాలీవుడ్ యువ గ్లామర్ భామ కృతి శెట్టి ఈ రోజు తన 26వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె అభిమానులు, సహనటులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియ చేశారు. ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఆ పోస్టర్‌లో ఇలా ఉంది . “ప్రతిభ, ఆకర్షణ , ఉత్సాహాల కలయిక అయిన కృతి శెట్టికి బర్త్ డే విషెస్.
ఈ సంక్రాంతికి భారీ తెరపై ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనతో కూడిన సరికొత్త రూపాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. జనవరి 12, 2027న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు అనిల్ రావిపూడి. సంపూర్ణ సాంప్రదాయ దుస్తులలో కృతి శెట్టి ఎంతో అందంగా కనిపిస్తూ అందరి మనసులను గెలుచుకుంది. అనిల్ రావిపూడి కూడా ఈ ప్రత్యేక సందర్భంలో కృతి శెట్టికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్ట్ ఇలా ఉంది: చిత్రంలో నీ నటనతో ఎంతో ఉత్సాహం, అమాయకత్వం , తాజాదనాన్ని తీసుకు రావడం చూడటం చాలా అద్భుతంగా ఉంది. రాబోయే ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటీవల ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో, కృతి శెట్టి ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.
మరోవైపు, ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ , కీర్తి సురేష్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పొంగల్ సీజన్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలను అందించడంలో పేరున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది అదే పండుగ సీజన్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూళ్లు , క్లైమాక్స్ కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తయ్యాయి. ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహూ నిర్మిస్తున్నారు.
