చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా అక్కడి ప్రజలకు సినిమా, రాజకీయ రంగాలతో పరిచయం ఉంది. గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత ముఖ్యమంత్రులుగా పని చేశారు. తాజాగా కేవలం 2 ఏళ్లలోనే టీవీకే పార్టీని ఏర్పాటు చేయడమే కాకుండా సుదీర్ఘ రాజకీయ పరమైన చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ఝలక్ ఇస్తూ ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. దీంతో మరో నటుడిగా గుర్తింపు పొందిన అజిత్ కుమార్ కు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే సీఎం విజయ్ , నటుడు అజిత్ మంచి ప్రాణ స్నేహితులు. ఇదిలా ఉండగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో, ఇతర అగ్రనటుల అభిమాన సంఘాలు కూడా తమ సొంత రాజకీయ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.
తాజాగా నటుడు అజిత్ అభిమానులు ‘తమిళగ మక్కల్ కళగం’ పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కల్లకురిచి జిల్లాలోని ఉలుందూర్ పేటలో మద్దతుదారులు పార్టీ జెండాను ఎగుర వేయడంతో ఈ పార్టీ అధికారికంగా ప్రారంభమైంది. ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అజిత్ పేరును ప్రకటించగా, రాష్ట్ర కార్యదర్శిగా రామ్‌కుమార్, కోశాధికారిగా మహమ్మద్ షా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని మాత్రం ఖాళీగా ఉంచారు. భవిష్యత్తులో అజిత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే ఆ పదవిని ఆయన కోసం కేటాయించనున్నట్లు పార్టీ నిర్వాహకులు తెలిపారు. అయితే, ఈ రాజకీయ పరిణామంపై నటుడు అజిత్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో నటుడు ధనుష్ భారీ సంఖ్యలో ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది కాలానికే ఈ పరిణామం చోటుచేసు కోవడం గమనార్హం. ఆ కార్యక్రమంలో, కేవలం సినిమా సంబరాలు, ఆడియో ఆవిష్కరణలకే పరిమితం కాకుండా అంతకు మించి ఆలోచించాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు; భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం తన అనుచరుల మధ్య ఉన్న బలమైన ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. అయినప్పటికీ, ధనుష్ కూడా ఇప్పటివరకు ఎటువంటి రాజకీయ పార్టీని ప్రకటించలేదు.
