అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సంచలన నిర్ణయాలకు తెర తీశారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి పెద్ద ఎత్తున. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై బలపరిచామని, జిల్లా నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణరాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు జనసేన పార్టీ అధ్యక్షుడు.
జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో పాటు, కమిటీలలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పవన్ కళ్యాణ్ తరపున ప్రకటించింది పార్టీ. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించ లేమని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది జనసేన పార్టీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అధికారికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేయడం జరిగిందని స్పష్టం చేసింది. అదే తరహా నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా కమిటీ విషయంలోనూ తీసుకున్నామని వెల్లడించింది.
ఇక నుంచి కొత్త కమిటీని నియమించే వరకూ ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ సాగుతుందని జనసేన పేర్కొంది.















