చెన్నై : ఎన్నో వివాదాల మధ్య అత్యంత జనాదరణ పొందిన నటుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ , పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం జన నాయగన్ ఎట్టకేలకు సెన్సార్ బోర్డు నుంచి విడుదలకు అనుమతి లభించింది. 12 కట్‌లతో సెన్సార్ క్లియర్ చేసుకుంది. ఒక చిన్నారిని నిప్పుతో కాల్చుతున్నట్లుగా ఉన్న అత్యంత బాధాకరమైన దృశ్యాన్ని సినిమా నుండి పూర్తిగా తొలగించారు. విజయ్ నటించిన రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ బోర్డు ఆమోదం పొందడంతో విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు వివాదాలు వెంటాడాయి. గతంలో జరిగిన ఎన్నికలకు ముందే జన నాయగన్ విడుదల కావాల్సి ఉంది. కానీ రాజకీయ పరమైన కారణాల వల్ల సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఏడు నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ సినిమాకు ‘అడల్ట్’ (పెద్దలకు మాత్రమే) రేటింగ్ లభించింది. సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పన్నెండు రకాల మార్పులను సూచించింది. అనేక కీలక సన్నివేశాలతో పాటు వివాదాస్పద సంభాషణలలో భారీ మార్పులు చేశారు. భారత జాతీయ జెండా నేల రాలడాన్ని చూపించే షాట్‌ను తొలగించాలని బోర్డు ఆదేశించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన బ్యాడ్జ్ కనిపించే దృశ్యాలను కూడా తొలగించారు. విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రస్తావన ఉన్న సంభాషణలను పూర్తిగా మార్చడం లేదా తొలగించారు. అలాగే, కొన్ని నిర్దిష్ట పదాలు , వివిధ మతపరమైన ప్రస్తావనలను కూడా సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకుంది.
