ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చిన జ‌గ‌న్ రెడ్డి

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోప‌ణ‌లు

hellotelugu-PawanKalyan

అమ‌రావతి : గ‌త వైసీపీ పాల‌న‌లో ఏపీ విధ్వంసానికి గురైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. నిర్వీర్య‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌న్నారు. నీటిపారుదల, రోడ్లు భవనాలు, పరిశ్రమలు ఇలా శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో రూ. 37 వేల కోట్లు విడుదల చేశాం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మిగిల్చిన అప్పులు తీరుస్తూ అదనంగా తాము కేంద్ర ప్రాయోజిత పథకాలకి 2025-26 ఆర్ధిక సంవత్సరంలోనే రూ. 18,700 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.10,500 కోట్ల నిధులను వినియోగించు కోవడంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం కారణంగా రూ. 8,700 కోట్లు నిరుపయోగం అయి పోయాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఫలితంగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయిందని అన్నారు. గత ప్రభుత్వంలో పూర్తి చేయకుండా వదిలేసి వెళ్లిన పులివెందుల, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కేటాయించి, మల్టీ విలేజ్ స్కీం ప్రాజెక్టులను ఈ వేసవిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాబోతున్నాం. అన్నారు. మరో రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ప్రారంభించినట్టు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న 3 వేల గ్రామాలను గుర్తించామ‌న్నారు. వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Exit mobile version