తాడేపల్లి గూడెం : సోమవారం ఉదయం ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందడం, రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు జగన్ రెడ్డి.
ఇదిలా ఉండగా లోకో పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టాటానగర్ నుంచి ఎర్నాకులం వెళ్తున్న రైలులో ఈ ఘటన జరిగింది . ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలను గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపి వేశాడు. పెను ప్రమాదం జరగకుండా అప్రమత్తం అయ్యాడు. ఈ మంటలు ఎక్స్ ప్రెస్ రైలు లోని బి1 కోచ్‌లో చెలరేగాయి. ఆ తర్వాత రైల్వే సిబ్బంది అగ్ని ప్రమాదానికి గురైన కోచ్‌లను మిగిలిన రైలు నుండి వేరు చేశారు.



















