రాయ‌ల‌సీమ‌కు తీర‌ని ద్రోహం చేసిన జ‌గ‌న్

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్

hellotelugu-MinisterSavitha

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ నిర్వాకం కార‌ణంగా రాయ‌ల‌సీమ తీవ్ర అన్యాయానికి గురైంద‌న్నారు. ఏనాడూ రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. కేవ‌లం త‌న హ‌యాంలో క‌మీష‌న్ల కోసం ప‌ని చేశాడ‌ని ఆరోపించారు. సోమ‌వారం స‌విత మీడియాతో మాట్లాడారు. దోచుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ తెర తీశాడంటూ ధ్వ‌జమెత్తారు. ఎన్జీటీ అడ్డుకోవడంతో ఆ కుట్ర విఫలమైంద‌ని అన్నారు. 2020 అక్టోబర్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయాలంటూ ఎన్జీటీ స్టే ఇస్తే, ఆ తరవాత మూడేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్ర‌శ్నించారు ఎస్. స‌విత‌.

ఇదే విషయమై ఆనాడే జగన్ ను వైసీపీ శ్రేణులు నిలదీసి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయ్యి ఉండేదని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోవడానికి ముమ్మాటికీ జగనే కారణమని, రౌండ్ టేబుళ్ల సమావేశాలంటూ ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్నదంతా డ్రామాలేనని విమర్శించారు. రాయలసీమను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారి రౌండ్ టేబుళ్ల సమావేశాల డ్రామాలు ప్రజలు గుర్తించారని, వైసీపీ కుట్రలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. కమీషన్ల కక్కుర్తి కోసం ఎటువంటి అనుమతులు లేకున్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తన హయాంలో జగన్ ప్రారంభానికి సిద్దమయ్యారన్నారు.

Exit mobile version