హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు శ్రీకాంత్ ఒడెల కలయికలో రాబోయే చిత్రం అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. దసరా , ‘ది ప్యారడైజ్’ వంటి చిత్రాల తర్వాత శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో కూడా తనదైన తీవ్రమైన శైలిని ప్రదర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఇది సినీ ప్రేమికులు , చిత్ర పరిశ్రమ వర్గాలలో భారీ అంచనాలను రేకెత్తించింది .అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కకపోవచ్చని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రారంభించే ముందు చిరంజీవి కొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
‘ది ప్యారడైజ్’ ప్రచార కార్యక్రమాల సమయంలో నటుడు నాని, శ్రీకాంత్ ఓదెల తమ తదుపరి ప్రధాన ప్రాజెక్ట్ తర్వాత చిరంజీవితో సినిమా ఉంటుందని సూచించారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ‘కాకా’ చిత్రం తర్వాత చిరంజీవి చేయబోయే తదుపరి పెద్ద ప్రాజెక్ట్ ఇదే అయ్యేది. కానీ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే వసూళ్లు సాధించినప్పటికీ, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను పొందింది. థియేటర్లలో సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత, చిరంజీవి-శ్రీకాంత్ ఒదెల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందా లేదా నిలిపి వేయబడుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా శ్రీకాంత్ ఓదెల సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై అనిశ్చితి నెలకొంది. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు కాకపోవచ్చని మరో వార్త కూడా వినిపిస్తోంది. బదులుగా చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు నిర్మాతలు స్క్రిప్ట్‌పై మరింత సమయం వెచ్చించి, అవసరమైన మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమా నిర్మాణం 2027 సంక్రాంతి సీజన్ తర్వాతే ప్రారంభం కావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే, ఆ విరామ సమయంలో చిరంజీవి తన ఇతర ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ కలయిక ఇప్పటికే అభిమానులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ‘కాక’ చిత్రం విడుదలైన తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


















