హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళన పేరుతో అక్రమాలకు తెర లేపారంటూ ఆరోపించారు. ఈ సందర్బంగా తమను మాట్లాడనీయకుండా మైకులు కట్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సర్కార్ , స్పీకర్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం హరీశ్ రావు అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డీ నువ్వు సీఎంవా లేక వీధి రౌడీవా అని భగ్గుమన్నారు.
తెలంగాణ కోసం చావు వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన తమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ గురించి నోరు పారేసు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అంతేకాకుండా వ్యక్తిగత కామెంట్స్ చేయడాన్ని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మీద చావు మాటలు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావంటూ ఫైర్ అయ్యారు హరీశ్ రావు. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో కావాలని మైక్ ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి మీద తాము విమర్శలు చేయొద్దని స్పీకర్ అంటున్నాడని, ఇక తాము ఉండీ ఏం లాభం అంటూ ప్రశ్నించారు . అవినీతికి అఫిషియల్ గా రేట్లు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు హరీశ్ రావు.


















