తిరుపతి : టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై. ప్రత్యేకించి టీటీడీ జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్ల జారీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సరైన భద్రతా తనిఖీ (security audit) యంత్రాంగాలు లేని పాత సాఫ్ట్‌వేర్‌నే టీటీడీ ఇంకా కొనసాగిస్తోందని భూమన ఆరోపించారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో భారీ ఎత్తున అవకతవకలు, అవినీతి జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. సామాన్య భక్తులకు టికెట్లు దక్కకుండా చేసి, వాటిని నల్లబ జారుకు మళ్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్వయంగా శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఉదయం 9 గంటలకు బుకింగ్‌లు ప్రారంభమైన ఒక్క నిమిషంలోనే మొత్తం 800 టికెట్లు అమ్ముడై పోయినట్లు చూపించిందని ఆయన తెలిపారు.
ఆన్‌లైన్ బుకింగ్‌లలో ఆటో-ఫిల్లింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పదేపదే ఫిర్యాదులు వచ్చినా ఈ సమస్యను పరిష్కరించడంలో టీటీడీ పాలకవర్గం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రస్తుత ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నాయకత్వంలోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. శ్రీవాణి టికెట్ల విక్రయాల ద్వారా ప్రతిరోజూ దాదాపు రూ. 40 లక్షల విలువైన అవినీతి జరుగుతోందని భూమన పేర్కొన్నారు. రూ. 300 విలువైన టికెట్లను నల్లబజారులో రూ. 3,000 వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. అలాగే బ్రేక్ దర్శన టికెట్లను ఒక్కోటి రూ. 5,000 నుండి రూ. 8,000 వరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం ద్వారా దాదాపు రూ. 48 కోట్ల విలువైన అవినీతి జరిగిందన్నారు. ఈ విషయంపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
