ముంబై : భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన రియాన్ పరాగ్ గురించి ప్రస్తావించాడు. ఈ జట్టును ఎలా నడిపించగలడని అనుమానం వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నాయకత్వం వహించడానికి, ఇలాంటి ఒక భారీ లీగ్‌లో నాయకత్వం వహించడానికి చాలా తేడా ఉంటుందన్నారు పఠాన్. అతనికి కెప్టెన్సీలో కొంత అనుభవం ఉంది, కానీ ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని అన్నాడు. గత రెండేళ్లలో రియాన్ పరాగ్ తన ఆట తీరును బాగా మెరుగు పరుచుకున్నాడు. కొంత అనుభవం ఉన్న యశస్వి జైస్వాల్ అతనికి సహాయ పడగలడు.
నిస్సందేహంగా ధ్రువ్ జురెల్ , సిమ్రాన్ హెట్‌మయర్ కూడా అతనికి అండగా నిలవగలరు. అయితే, అతనికి అందరికంటే ఎక్కువగా సహాయ పడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది రవీంద్ర జడేజానేనని అన్నాడు ఇర్ఫాన్ పఠాన్. అతను కెప్టెన్‌గా అంతగా విజయం సాధించి ఉండక పోవచ్చు, కానీ మైదానంలో అంతటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉండటం జట్టుకు ఎంతో మేలు చేస్తుందన్నాడు. మీరు సంజు శాంసన్ లేని లోటును ఖచ్చితంగా అనుభవిస్తారని పేర్కొన్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదన్నాడు పఠాన్.
