పోలవరం : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌లోని గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాలతో పాటు జీ హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను వీక్షించారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులు వారికి వివరించారు. ఛాయాచిత్రాల ప్రదర్శన ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన పనులు, నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులను తెలియ చేశారు. పోలవరం పనులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు. వీరి పర్యటన సమయంలో కొద్దిసేపు వర్షం కురిసింది. తొలిరోజు పర్యటన అనంతరం నిర్వహించిన సమీక్షలో ఇప్పటి వరకు జరిగిన పనుల పట్ల నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర జలశక్తి శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్నారు. వారికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, ఎంఈఐఎల్ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పర్యటనల్లో నిపుణులు చేసిన సూచనలు, సలహాల మేరకు చేపట్టిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని అధికారులు వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే ఏడు విడతల్లో సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రస్తుతం ఎనిమిదో విడత పర్యటనలో భాగంగా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తోంది. ఈ ఏడాది మే నెలలోనూ నిపుణుల బృందం పోలవరాన్ని సందర్శించింది. గతంలో ఇచ్చిన సూచనలు, సలహాలను అమలు చేసిన తీరు, వాటి ఆధారంగా చేపట్టిన పనుల పురోగతిని ప్రస్తుత పర్యటనలో పరిశీలిస్తోంది. అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం పర్యటన ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది.
ఈ సమావేశంలో అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ పాల్ పాల్గొన్నారు. కేంద్ర జలసంఘం డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ సరబ్జిత్ సింగ్ బక్షి, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, ఉప సంచాలకుడు ఏ. ప్రవీణ్, చీఫ్ ఇంజినీర్ ఎం. రమేష్‌కుమార్, సహాయ సంచాలకుడు సీహెచ్ సంజీవ్, నేషనల్ వాటర్ సిస్టం డైరెక్టర్ పన్నీర్ సెల్వం, ఉప సంచాలకులు అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, సహాయ సంచాలకుడు హేమంత్ గౌతమ్ పాల్గొన్నారు . సి ఎస్ ఎం ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు షాహిద్ నూర్, ఎం.కె. బాషా, ఉదయ్ భాను చక్రబోర్తి, వ్యాప్కోస్ జనరల్ మేనేజర్ కేపీఎస్ త్యాగీ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ కె. నరసింహమూర్తి, చీఫ్ ఇంజినీర్ కె. శేషుబాబు, ఎస్ఈలు పి. రామచంద్రరావు, డి. తిరుమలరావు, ఈఈలు డి. శ్రీనివాస్, ప్రేమ్‌చంద్, కె. బాలకృష్ణమూర్తి, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏవీ గంగాధర్‌కుమార్, డీజీఎం మురళి పమ్మి, కోఆర్డినేటర్ ఠాగూర్ చంద్ వీరి వెంట ఉన్నారు.
