అమరావతి : ఇథనాల్ తయారీ విషయంలో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. 40 శాతం ఇథనాల్ బ్లెండ్ చేసేందుకు కేంద్రం అంగీకరిచిందన్నారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రొత్సాహిస్తే… రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇథనాల్ బేస్డ్ ఇంధనం అని, ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. బయో ఫ్యూయల్స్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందన్నారు సీఎం. ఈ విషయంపై ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు. అలాగే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు తీసుకు రావడంతో పాటు.. విద్యుత్ సరఫరా అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. ఈ ఏడాది డిమాండ్ లో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య విభాగాల వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఎంత అవసరం అవుతుందో అంచనాలు తయారు చేయాలన్నారు.
సోలార్ విండ్, పంప్డ్ స్టోరేజితో పాటు BESS టెక్నాలజీకే ఇక భవిష్యత్తు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీకి అనుగుణంగా పంప్డ్ స్టోరేజి సహా ఇతర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేప్టటాలని అన్నారు సీఎం. లీథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఈవీలకు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలపై దృష్టి పెట్టాలని చెప్పారు. బ్యాటరీ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టండి. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ వినియోగం అనేది అత్యంత కీలకం అని పేర్కొన్నారు సీఎం. డేటా సెంటర్ల అనుమతుల విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు .. సెమీ కండక్టర్లపై ఎక్కువ దృష్టి సారించాలి. దానికి సంబంధించిన ఎకోసిస్టంపై ఎక్కువ ఫోకస్ చేద్దాం అన్నారు.

















