ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తీపి కబురు చెప్పింది సర్కార్. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేవలం 10 రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేస్తామని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇదే సమయంలో ఎల్ నినో ప్రభావం వల్ల ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరాలో ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ సంభావ్య నష్టాలను నివారించడానికి రైతులు రెండో పంట వేయవద్దని పొంగులేటి సలహా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్న తుది బిల్లులను లబ్ధిదారులకు చెల్లిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలంలోని రైతు వేదికలో జరిగిన ఒక సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. పారదర్శకమైన, అవినీతి రహిత ప్రక్రియ ద్వారా ఈ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని మంత్రి తెలిపారు.
నేలకొండపల్లి మండలంలో మొదటి దశలో మంజూరైన 648 ఇళ్లలో, 620 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన ఇళ్లు పైకప్పు దశకు చేరుకున్నాయని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం నేలకొండపల్లిలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, బౌద్ధ వారసత్వ ప్రదేశ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చారిత్రాత్మక బౌద్ధ స్థూపం, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుమారు 50 నుంచి 55 సంవత్సరాల క్రితం కనుగొనబడిన ఈ స్థూపం, దేశంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపాలలో ఒకటిగా పరిగణించ బడుతుంది. గత ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి పనులను ప్రారంభించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ అసంపూర్తిగా మిగిలి పోయింది. స్థూపం చుట్టూ 1.5 కిలోమీటర్ల పరిధిలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో అనేక పురాతన వస్తువులు బయట పడ్డాయి. నీలకొండపల్లిలో వాటిని భద్రపరచడానికి తగిన సౌకర్యాలు లేక పోవడంతో, వీటిని హైదరాబాద్లోని మ్యూజియంలకు తరలించారు.

















