ఢిల్లీ : ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది ప్రయాణీకులకు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 80 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణీకులు లబోదిబోమంటున్నారు. గత కొంత కాలంగా ఇండిగో ఇష్టానుసారం రద్దు చేస్తూ వస్తోంది. ఎయిర్ లైన్స్ కు కేంద్రానికి మధ్య వార్ కొనసాగింది. ఈ తరుణంలో ఇప్పటికే జరిగిన అసౌకర్యానికి మన్నించాలని కోరారు ఇండిగో సీఈవో. తాజాగా మరోసారి ఇండిగో ఉన్నపళంగా రద్దు చేయడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు ప్రయాణీకులు. ఇదిలా ఉండగా ఇవాళ ఆకాశంపై దట్టమైన శీతాకాలపు పొగమంచు దుప్పటి కప్పేసింది. దీంతో విమానాలు వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతోందని తెలిపింది ఇండిగో.
కాగా ఇప్పటికే ఉన్న విస్తారమైన దేశీయ నెట్‌వర్క్‌లో 80 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది . దీని కారణంగా వేలాది మంది ప్రయాణీకులను గందరగోళంలో పడేసింది. కాగా రద్దయిన ఫ్లైట్స్ లలో సగం రద్దులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్రీకృతమై ఉన్నాయి, ఇక్కడ విమాన కార్యకలాపాలు తక్కువ దృశ్యమానత CAT III పరిస్థితులలో కొనసాగాయి. తెల్లవారుజాము నుండి ఇప్పటికే దట్టమైన పొగమంచుతో ఇబ్బంది పడుతున్న దేశ రాజధాని అంతరాయానికి కేంద్రంగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, కోల్‌కతా, అమృత్‌సర్, చండీగఢ్, జైపూర్, డెహ్రాడూన్, ఇండోర్, పాట్నా, భోపాల్ వంటి ప్రధాన కేంద్రాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది.


















